Tuesday, December 17, 2019

శ్రీనాథుని ధ్వన్యనుకరణపదరచనా నైపుణ్యం


శ్రీనాథుని ధ్వన్యనుకరణపదరచనా నైపుణ్యం
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

ప్రతిభాషలోను ఎన్నో  ధ్వన్యనుకరణపదాలు ఉంటాయి . గణ గణ , గల గలా,  దడ దడ, ఫెళ ఫెళ , బిరబిర మొదలైన పదాల్ని ధ్వన్యనుకరణపదాలని పిలుస్తారు . ఇటు వంటి పదాలు ప్రతి భాషలోను కోకొల్లలుగా ఉంటాయి.  ఆ పదాలు చెవిని పడగానే మనకు అక్కడి పరిస్థితి అర్థమౌతుంది .  మహాకవుల నుండి సామాన్యకవుల వరకు ఎంతోమంది ఈ ధ్వన్యనుకరణపదాల్ని విరివిగా ప్రయోగించారు . అవన్నీ ఒక ఎత్తైతే శ్రీనాథమహాకవి ప్రయోగించిన ధ్వన్యనుకరణపదం మరో  ఎత్తు . బహుశా ! ఇంత గొప్పగా ధ్వన్యనుకరణ పదం వాడిన మరో తెలుగుకవి నాకు కనిపి౦చ లేదు.  ముందుగా పద్యం చూద్దాం . ఇది హరవిలాసం లోనిది .

ఉరుమురిమి వేడిగాడ్పులు
చరవి విసరజొచ్చె  మదనసంహరు దెస క్రొ
మ్మెరుగుద్భవించె కప్పలు
గరరవరట్ కురరవరరగట్టని యరచెన్

  ఈశాన్యదిశలో ఉరుములు ఉరిమాయట . వేడి గాలులు వీచాయట , మెరుపులు కూడ మెరిశాయట.  కప్పలు  రెండు శ్రేణులుగా నిలిచి ఒక శ్రేణి  గరరవరట్ అని మరోశ్రేణి కురరవరరగట్  అని అరిచాయట.  ఈశాన్యదిశలో ఉరుములు , మెరుపులు , గాలులు ఉంటే తప్పక వర్ష౦ పడుతుంది . అవే మెరుపులు , ఉరుములు , గాలులు  ఆగ్నేయదిశలో కనిపిస్తే  అసలు వర్షమే రాదని శాస్త్రం చెబుతోంది . 
विद्युदुत्तरपूर्वायाममोघा: मरुतोsथवा |
यदि दक्षिणपूर्वायां वृष्टिर्नैव भवेत्तथा ||

విద్యుదుత్తర పూర్వాయామమోఘా: మరుతోథవా
యది దక్షిణ పూర్వాయాం వృష్టిర్నైవ భవిష్యతి 

 ఈ విషయం మనలో  చాలమందికి   తెలియకపోయినా  కప్పలన్నిటికీ  బాగాతెలుసు అందుకే అవి అరుస్తున్నాయట . అవి ఎంత సహజరమణీయంగా అరుస్తున్నాయో శ్రీనాథుడు వర్ణించాడు . శ్రీనాథుని ప్రకృతిపరిశీలన నైపుణ్యానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ .   వర్షం పడిన తరువాత కప్పల అరుపులు విన్న వారికి ఈ పద్యంలోని స్వారస్యం తెలుస్తుంది . కొన్ని  గరరవరట్ అని అరిస్తే మరి కొన్ని   కురరవరరగట్ అని అరిచాయట.    గరరవరట్  కురరవరరగట్  గరరవరట్  కురరవరరగట్  అనే ఈధ్వనులను మనం అనుకరిస్తే ఆపకుండా ఉచ్చరిస్తే కప్పల అరుపులు అనుభవంలోకి వస్తాయి .


No comments: