Tuesday, December 24, 2019


మాటకు మాట

(రంభా మాయారంభల వాగ్యుద్ధం)

                                                            పింగళి సూరన

పింగళి సురనగారి కళాపూర్ణోదయం తెలుగుసాహిత్యంలోనే ఒక అపూర్వమైన ప్రబంధం. కేవలకల్పనాకథలు కృత్రిమరత్నములని రామరాజభూషణుడు ఎంత కొట్టి పారేసినా ఇది యే ప్రబంధానికి వీసం కూడ తీసిపోని సాటిలేని మేటి ప్రబంధం.   ఆ గ్రంథం లో ఒక సంఘటన పరిశీలిద్దాం.

సాధారణంగా ఇద్దరు వ్యక్తులమధ్య అందులోనూ ఆడవాళ్ళ మధ్య వాగ్వివాదం జరిగితే చాల గమ్మత్తుగా ఉంటుంది . ఎలా ఉంటుందో మన ప్రబంధకవుల్లో ఒకరైన  పింగళి సూరన చాల చక్కగా , ఎంతో  వినసొంపుగా వర్ణించాడు . అది ఒకసారి గమనిద్దాం .  

కళాపూర్ణోదయంలో ఒక చోట రంభానలకూబరులు విమానంలో విహరిస్తూ ఉంటారు . వేరొకచోట మరోజంట రంభా నలకుబరుల వేషంలో అక్కడకు ప్రవేశిస్తారు . ఎవరు అసలు రంభో ,ఎవరు కుహనా రంభో , ఎవరు అసలు నలకుబరుడో ఎవరు కుహనా నలకుబరుడో పోల్చుకోవడం కష్టం . ఒకరికొకరు ఆచ్చు గుద్దినట్లు ఉంటారు . రంభకు , మాయారంభకు మధ్య వాగ్వివాదం చెలరేగుతుంది. వాళ్ళ రూపాలే కాదు మాటలు కూడా అచ్చుగుద్దినట్లు ఒకలాగే ఉన్నాయి .వారి వివాదం  ఎంత సహజంగా మనోహరంగా ఉందో  స్వయంగా చూడండి .   

 అంత మదింపకువే యని పలికిన అంత మదింపకువే యనుచున్
గంతులడంచెద లెమ్మని పలికిన గంతులడంచెద లెమ్మనుచున్
రంతుల నేమి ఫలంబని పలికిన రంతులనేమి ఫలంబనుచున్
పంతము చూడగదే యని పలికిన పంతము చూడగదే  యనుచున్

ఒట్టుసుమీ యన్న ఒట్టు  సుమీ య౦చు
ఏమేమి యనిన ఏమేమి యనుచు
కానీగదే యన్న కానీ గదే యనుచు
నింకేమి  యన్న నింకేమి యనుచు
ఓసి పోవే యన్న ఓసి పోవే యనుచు
నౌనంటిననిన నౌనంటి నంచు
మరువకు మిది యన్న మరువకు మిది యంచు
నీవెంత యనిన నీవెంత యనుచు
నొకని మగనికి నాశింప నొప్ప దనిన
నొకని మగనికి నాశింప నొప్ప దనుచు
బట్టి యాడె నారంభాతో ప్రథమ రంభ
ప్రియుడు నిలుమన్న నిలువక పెద్ద రొదగ (   పింగళి సూరన )



<.><>><>><>><..



No comments: