Friday, December 13, 2019

సూర్యునికేసి తిరిగి ఉమ్మేస్తే అది మన మొహం మీదే పడుతుంది


సూర్యునికేసి తిరిగి ఉమ్మేస్తే అది మన మొహం మీదే పడుతుంది

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

ఈనాటి మన భారతీయసమాజంలో కొన్ని వింత వింత పోకడలు కని పిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవలసింది ఆత్మశ్లాఘ, పరనింద . ప్రతివాడు ఎవడి డప్పు వాడు ఎంతసేపైన వాయించుకోవచ్చు దానివల్ల ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు .  వాయించుకుని , వాయించుకుని  విసుగొచ్చాక  వాడే మానేస్తాడు.  కాని పరనింద ప్రమాదకరం. కొంత మంది అజ్ఞానంతోనూ మరి కొంతమంది cheap popularity కోసం ఈ పని చేస్తూ ఉంటారు . ఎవరికైనా ఏ వ్యక్తినైనా విమర్శించే హక్కు ఉంటుంది కాదనం కాని ఆ విమర్శ  సరైనదా కాదా అనేది ప్రతివాడు ఆలోచించు కోవాలి. ఎందుకంటే విషం ఒక వ్యక్తిని మాత్రమె చంపుతుంది మిగిలిన వారు ఆ బారినుంచి తప్పించుకోవచ్చు . అలాగే కత్తి ఒక వ్యక్తిని మాత్రమె చంపుతుంది . మిగిలినవారు తప్పించుకోవచ్చు. కాని చెడు భావజాలం దేశాన్ని , ప్రభుత్వాన్ని , ప్రజల్ని కూడా సర్వనాశనం చేస్తుంది .
ఏకం విషరసో హంతి శస్త్రేణైకశ్చ హన్యతే
సరాష్ట్రబంధుం రాజానం హంత్యేకో భావవిప్లవ:
అని పెద్దల మాట .    అసలు విషయానికొస్తే ముఖ్యంగా నేడు కొంతమంది మన జాతిపిత గాంధీమహాత్మునిపైన కూడ తెలిసీ తెలియని విమర్శలు కురిపిస్తున్నారు . శ్రీరాముడు పురాణపురుషుడు.  ఆయన పుట్టినప్పుడే భగవదంశతో ఉన్నాడని ఇతిహాసం చెబుతోంది . అలాగే కృష్ణపరమాత్మ . బుద్ధభగవానుడు, వర్ధమానమహావీరుడు వంటి మహాత్ముల పుట్టుకలు కూడ అటువంటివే . వారు తమ తమ మాతృగర్భాల్లో  ప్రవేశించినప్పుడు కొన్ని అతీతశక్తులు వారి వారి తల్లుల గర్భాల్లో  ప్రవేశించాయని ఇతిహాసాలు, చరిత్రలు  చెబుతున్నాయి  . కాని ఎటువంటి అతీతమైన శక్తులతో ప్రమేయం లేకుండా శారీరకంగాను , బౌద్ధికంగాను మానసికంగాను సామాన్యవ్యక్తిగా జన్మించి  హిమాలయపర్వతం కూడ తలెత్తి  చూడవలసినంత ఎత్తుకెదిగిన సర్వోన్నతుడైనవ్యక్తి మన జాతిపిత గాంధీజీ . ఆయన్ని కూడ విమర్శిస్తున్నారంటే అజ్ఞానంతోనా లేక cheap popularity కోసమా అని ప్రతి ఆలోచనా పరుడికి అనిపిస్తుంది . ఇది నిజం . సంస్కృతంలో ఒక సూక్తి ఉంది .
ఘటం భిద్యాత్ పటం ఛిద్యాత్  కు ర్యాద్వా గార్దభస్వరం
యేన కేనాప్యుపాయేన ప్రసిద్ధ: పురుషో భవేత్
అక్కడొక కుండ ఉంటే బద్దలు కొట్టు . అక్కడొక మంచి గుడ్డ ఉంటే చింపెయ్యి. అలాగే గాడిదలా ఓండ్రపెట్టు .ఏం చేసినా పరవాలేదు . అందరి గుర్తింపు పొందడమే ముఖ్యం అని దాని అర్థం . కొంతమంది పాపం ఈ పధ్ధతి ఎన్నుకుంటారు . ఉదాహరణకి రాముడు మంచివాడని వ్రాస్తే అది ఎవరు పట్టించుకోరు . అలా కాకుండా రాముడు చెడ్డవాడు అని వ్రాస్తే మాత్రం చాల మంది దృష్టి అతనిపై పడుతుంది . ఇటువంటి cheap మనస్తత్వం కొంతమందికుంటుంది పాపం అది వాళ్ళ దురదృష్టం . వాళ్ళు cheap popularity కోసం ఇటువంటి విమర్శలు చేస్తూ వారి అవివేకం బయట పెట్టుకుంటూ ఉంటారు . ఒకవంక సమస్త ప్రపంచం మహాత్మునివైపు  చూస్తూ , ఇటువంటి వ్యక్తి  భారతదేశంలోనే ఎందుకు పుట్టాడని మన దేశంలో ఎందుకు పుట్టలేదని మనమీద అసూయపడి చస్తో౦టే మనం ఆయన్ని చులకనచేసి మాట్లాడుకుంటున్నాం . ఇదెంత వింత పోకడ!
ఎవడు మహాత్ములను నిందిస్తాడో అతడు మాత్రమేకాదు ఆ నిందల్ని విన్నవాడు  , తలూపేవాడు కూడ పాపాత్ములౌతారని మన పెద్దలు అన్నారు .
న కేవలం యో మహతోsపభాషతే శ్రుణోతి తస్మాదపి య: స పాపభాక్
( కుమారసంభవం కాళిదాసు) .
సూర్యునికేసి తిరిగి ఉమ్మేస్తే అది మన మొహం మీదే పడుతుంది . నోరు పవిత్రంగా ఉండాలి, పాకీ దొడ్డి కాకూడదు .
                   <><><>,><><>


No comments: