Wednesday, March 1, 2023

7. మన్వాది స్మృతులలో అద్వైతవిషయాలు. (

 

7. మన్వాది స్మృతులలో అద్వైతవిషయాలు.

(పోలకం శ్రీ  సుందరశాస్త్రి వర్యులు)     

అనువాదం :- డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు 

ధర్మం మోక్షప్రాప్తికి  ప్రధానసాధనం కాబట్టి  స్మృతులు ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఎన్నో విషయాలు ప్రాస్తావికంగా వివరించాయి. ఆత్మస్వరూప సాక్షాత్కారమే అన్ని ధర్మాలలో ప్రధానమైనదని పేర్కొన్నాయి.

 మనుస్మృతి యొక్క ఉపక్రమ - ఉపసంహారాలు ఆత్మజ్ఞానమే అత్యున్నతమైన మోక్షసాధననమని  వివరించాయి.

  యోగమార్గం ద్వారా ఆత్మను తెలు తెలుసుకోవడమనేది  అన్ని ధర్మాల్లో కెల్ల ఉత్తమ ధర్మమని మనుస్మృతి పేర్కొంది. (1-8)

‘ నేను అన్ని జీవులలోను  ఆత్మరూపంగా ఉన్నాను, అన్ని జీవులు ఆత్మరూపంగా నాలో ఉన్నాయి అని అంతట ఏకత్వాన్ని దర్శించడం వల్ల భక్తుడు ఆత్మ(బ్రహ్మ) సాక్షాత్కారాన్ని పొందగలడని తెలిపింది.   అదియే స్వారాజ్య సిద్ధి అని వివరించింది. ఆత్మ స్వయం ప్రకాశకం కావడం వల్ల (స్వయం రాజతే ఇతి స్వరాట్ ) ఆత్మలాభమే స్వారాజ్యసిద్ధి. జడం తనను తాను తెలుసుకోలేదు, ఇతర పదార్థాలను తెలుసుకోలేదు. మనస్సు ఇతరవస్తువుల్ని తెలుసుకుంటుoదిగాని  తనను తాను తెలుసుకోలేదు. ఇక ఆత్మ  విషయానికొస్తే అది అన్నిటినీ తెలుసుకుంటుంది  తనను కూడ  తాను తెలుసుకుంటుంది. అందుకే “ఆత్మన్యేవాత్మానం పశ్యేత్” అన్నారు. అందుకే ఆత్మదర్శనాన్ని స్వారాజ్యసిద్ధి అని కూడ పిలుస్తారు.  ధర్మశాస్త్రాలు ధర్మాన్ని నిర్వచిస్తూ పది లక్షణాలు చెప్పాయి. అందులో ‘విద్య’ అనే పదం ఉంది. ఆ పదానికి ధర్మశాస్త్ర వ్యాఖ్యాత కుల్లూకుడు ఆత్మజ్ఞానమని నిర్వ చించాడు. మనువు, బ్రహ్మ ఈ జగత్తుకు కర్త కాబట్టి ఆత్మజ్ఞానమే అన్ని ధర్మాల కంటే ప్రధానమైన దన్నారు.  బ్రాహ్మణుడు ధర్మాచరణ ద్వారా ఆత్మజ్ఞానరూపమైన మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి విప్రుని ధర్మానికి అవతారంగాను , ప్రతిరూపంగాను వర్ణించాడు.

అద్వైత సిద్దాంతంలో ప్రధానసూత్రమైన మోక్షప్రాప్తికి ధర్మమే ప్రధాన సాధనమని, వేదాధ్యయనం , తపస్సు, జ్ఞానం, ఇంద్రియ నిగ్రహం , అహింస , గురుసేవ మొదలైనవి మోక్షానికి సాక్షాతత్సాధనాలుగా చెప్పడం విశేషం (12-83, 12-85)

కర్మ నివృత్తిద్వారా పంచభుతాలను అతిక్రమించవచ్చుననే మాటలు  అద్వైత సిద్ధాంతాన్నే సమర్ధించేవిగా కనిపిస్తున్నాయి .               

యాజ్ఞవల్క్యస్మృతికి వ్యాఖ్యానమైన ‘మితాక్షరి’లోని  ప్రాయశ్చిత్తకాండ ప్రారంభంలో  ముందుగా జీవేశ్వరాభేదవాదం   కనిపిస్తోంది(1/34).

 యతిధర్మ ప్రకరణంలో (1౦8-110)

ఆత్మజ్ఞానమే పునర్జన్మనివృత్తికి కారణమని చెప్పబడింది..

ఆత్మజ్ఞానాన్ని చెప్పడం కోసం స్వీకరించిన ఘటాకాశ, ప్రతిబింబవాదాలన్నీ   అద్వైత తత్వాన్నే సమర్ధిస్తున్నాయి.

                                                 

గ్రంథసమాప్తిలో  ‘ నేను ఆత్మ ఆత్మను ఎలా  సృష్టిస్తోంది? ఆత్మకు త్రిగుణాలతో  ఎలా సంబంధం ఏర్పడుతుంది? ఆత్మశరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది? జీవునిగా ఎలా అవతరిస్తుంది? సంసారమనే చక్రంలో ఎలా  పరిభ్రమిస్తుంది? అనే విషయాలు వివరించాను. దీన్ని బట్టి జీవుడు ఈశ్వరుడు ఒకరేనని తెలుస్తోంది. కాబట్టి ఈ శాస్త్రం యొక్క సారాంశం ఈశ్వరుడు జీవుడు ఒకటేనని బోధించడమే అని వివరిస్తుంది.

విష్ణుసంహితలో (అధ్యాయం -96) విష్ణువు భూదేవితో ఈ శరీరం క్షేత్రమని అది తెలుసుకున్న వాడు క్షేత్రజ్ఞుడని చెపుతూ ఓ దేవీ !  నన్ను అన్ని క్షేత్రాలలోను నెలకొన్న క్షేత్రజ్ఞునిగా తెలుసుకో అంటాడు.

క్షేత్ర - క్షేత్ర జ్ఞానమే మోక్షమార్గానికి ప్రధాన సాధనమని వివరించాడు. నిర్గుణోపాసన గురించి వివరిస్తూ నిర్గుణోపాసన చేయలేని వారికి సగుణోపాసన శ్రేయస్కరమని వివరించింది. జ్ఞానమే మోక్షసాధనమని నిర్ధారణ చేసింది .

నిర్గుణోపాసన గురిం చి వివరిస్తూ  సగుణోపాసన అనేది  నిర్గుణోపాసన చేయలేని వారికి విధింపబడినదని  వివరిస్తుంది.

గ్రంథ  పరిసమాప్తిలో జ్ఞానం బ్రహ్మ సాక్షాత్కారానికి సాధనమని చెప్పడం ద్వారా అద్వైత సిద్ధాంతభావాలను వేలువరించి నట్లుగా  తెలుస్తోంది.

దక్ష స్మృతి  ‘ఎవడు సమస్తాన్ని మనకంటే అభిన్నంగా  చూస్తాడో వాడే బ్రహ్మజ్ఞాని’ అని చెపుతోంది.

మనస్సును కర్మబంధనాలనుండి విముక్తి చెయ్యడం, క్షేత్రజ్ఞుని పరమాత్మగాభావించడం ఉత్తమమైన యోగసాధన అని వివరించింది. మనసును సమస్తకర్మబంధములనుండి  తప్పించి క్షేత్రజ్ఞునివైపునకు మరల్చడమే ఉత్తమమైన యోగసాధనగా పేర్కొంది. ఈ విధంగా దక్షస్మృతి ధర్మాన్ని నిర్వచించడంలో అద్వైత భావాలనే సమర్ధించిందని చెప్పవచ్చు .   

శంఖసంహిత కూడ ఇరువది ఐదవ తత్వమైన పురుషుడు లేదా ప్రత్యగాత్మ (జీవాత్మ ) పరమాత్మకంటే భిన్నుడు కాడనే జ్ఞానం వల్లనే మోక్షం సిద్ధిస్తుందని వెల్లడించింది.

<*><*><*><*><*>

6. అథర్వవేదంలో అద్వైతభావాలు.

 

6. అథర్వవేదంలో అద్వైతభావాలు.

(శ్రీ. శివరామకృష్ణ శాస్త్రి)

అనువాదం :- డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 కర్మకాండకు సంబంధించిన అధర్వవేదంలో కూడ అద్వైత వేదాంతానికి సంబంధించిందన ఎన్నో  విషయాలు  కనిపిస్తున్నాయి .కాలసూక్తంలో

“ బ్రహ్మ హోతా , బ్రహ్మ యజ్యా బ్రహ్మణా స్వరే వోమితా: |

అధ్వర్యు: బ్రాహ్మణో జాతో బ్రాహ్మణో soతర్హితం హవి:” || మొదలైన మంత్రాలద్వారా

 బ్రహ్మమే  హోత, బ్రహ్మమే యాగము, బ్రహ్మమే  యథార్థమైన యజ్ఞంఫలం అని చెప్పబడింది.

అలాగే “ త్వం స్త్రీ త్వం పుమానసి త్వం కుమారా ఉత వా కుమారీ|త్వం జీర్ణో దండేన వంచసి త్వం జాతో భవసి విశ్వతో ముఖ:” || ( అథర్వ*11 కాండం -9,10,11) మొదలైన శ్రుతులు “నీవే స్త్రీ , నీవే పురుషుడవు, నీవే బాలుడవు , నీవే బాలికవు , నువ్వు దండం పుచ్చుకొని నడుస్తున్నావు. నీవే విశ్వతోముఖుడవు”  (10-8-27) అని చెపుతున్నాయి.  

            <*><*><*><*>

5. సామవేదంలో అద్వైతభావాలు

 

5. సామవేదంలో అద్వైతభావాలు

(మాయూరవాసీ శ్రీ. రామనాథ దీక్షిత:)

అనువాదం :- డాక్టర్ చిలకమర్తి దుర్గాప్రసాదరావు .

సామవేదానికి ఒక 1000 శాఖలున్నట్టుగా తెలుస్తోంది. వీటిలో కౌథుమశాఖ ఒక్కటే  దక్షిణ భారతదేశంలో చాల ప్రాచుర్యంలో  ఉంది. ఈ వేదానికి  సంబంధించినటువంటి సంహిత, ఎనిమిది  బ్రాహ్మణాలు ఎన్నో  అద్వైత వేదాంత విషయాలతో కూడి ఉన్నాయి.  సామవేదబ్రాహ్మణoలో ఒకచోట సృష్టికర్త ‘అహమ:’ అనే పదం ద్వారా అహమునిగా చెప్పపడ్డాడు. దీని సారాంశం ‘నేను’ అని.  దీన్ని బట్టి  ప్రపంచానికి ఆధారం, సృష్టికర్త అయిన ప్రభువు, జీవుడు ఒకరేనని  తెలుస్తోంది.   మట్టి యొక్క స్వరూపం తెలిస్తే ఆ మట్టితో చేయబడిన వస్తువుల యొక్క స్వరూపం తెలుస్తుంది  ఎందుకంటే మట్టితో చేయబడిన వస్తువులు  మట్టి యొక్క ప్రతిరూపాలు లేదా వికారాలు  మాత్రమే, అవి మట్టికంటే  భిన్నం కావు . మట్టి ఒకటే సత్యము, నిత్యమున్ను   . నామరూపాలు సత్యం కావు.  కాబట్టి  ఆత్మజ్ఞానం కలిగితే  సమస్తము తెలుస్తుంది , అవగతమౌతుంది(ఛా౦దోగ్యం-6)  అనే విషయం “తత్త్వమసి” (ఛా౦దోగ్యం-6) అనే వాక్యం ద్వారా జీవునికి  పరమాత్మకు భేదం లేదని చెప్పబడింది. పరమేశ్వరుడే జీవుల యొక్క శరీరంలో ప్రవేశించి నామ రూపాలు కల్పించాడని తెలుస్తోంది. ఈ విషయాలన్నీ ఛా౦దోగ్యం ద్వారా మనకు తెలుస్తున్నాయి.

                 *X*X*X*X*X*X*

4. యజుర్వేదంలో అద్వైతభావాలు

 

4. యజుర్వేదంలో అద్వైతభావాలు

(శ్రీ శంకరకింకరులు)

అనువాదం :- డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు 

 యజుర్వేదం నూట ఒక్క శాఖలు (1౦1) గా విభజింపబడింది. ఇది   దక్షిణభారతదేశంలో  చాల ప్రచారంలో ఉంది . యజుర్వేదానికి సంబంధించిన తైత్తిరీయోపనిషత్తులోను, కర్మకాండకు సంబంధించినటువంటి మరికొన్ని చోటు లందు అద్వైతసిద్దాంతవిషయాలు ఎన్నో  కనిపిస్తున్నాయి.

“ భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి తానే స్వయంగా ప్రవేశించాడు”  అని తైత్తిరీయోపనిషత్తు చెపుతోంది .(తైత్తిరీయ ఉపనిషత్తు)

 సూర్యునిలో ఉన్న ఆ పరమాత్మ, నీలో ఉన్న ఆ పరమాత్మ ఇద్దరు ఒకటేనని  తైత్తిరీయ ఉపనిషత్తు చెపుతోంది.  పరమేశ్వరుడే మనకు తండ్రియని, అతడే రక్షకుడని, తన నుంచే నామరూపాత్మకమైన  ఈ ప్రపంచం సృష్టించాడని, తానే అనేక దేవతారూపాలతో ఉన్నాడని,  ఈ ప్రపంచమంతా ఆయనలోనే దాగి ఉందని తైత్తిరీయసంహిత వివరించింది. ఈ ప్రపంచానికి సృష్టికర్తయైన భగవంతుని నువ్వు తెలుసుకోలేవని , అతనికి నీకు మధ్య మాయ అనే మంచుపొర ఉందని మానవులు మాయ అనే మంచుతెర ముసుగులో సుఖం అనుభవిస్తూ, ఆనందిస్తున్నారని వివరిస్తోంది.

                                             >*<>*<*><*><

 

3. ఋగ్వేదంలో అద్వైత భావాలు

 

  3. ఋగ్వేదంలో అద్వైత భావాలు

                (జంబుకేశ్వరం శివరామకృష్ణ ఘనాపాఠీ               అనువాదం :- డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.


ప్రతి వేదం కర్మకాండ -జ్ఞాన కాండ అని రెండు భాగాలుగా విభజింపబడింది . పూర్వమీమాంస కర్మకాండగాను , ఉత్తర మీమాంస జ్ఞానకాండగాను వ్యవహరించబడుతున్నాయి.

పూర్వమీమాంస సమస్త మానవజాతి  సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మానవునికి ఎన్నో యజ్ఞయాగాది వైదిక కర్మలు విధించింది. ఇక వేదానికి రెండో భాగం అయినటువంటి జ్ఞానకాండ మానవునికి కావలసిన ఆత్మ(స్వరూప) జ్ఞానం బోధిస్తుంది.  ఈ ఆత్మజ్ఞానప్రాప్తికి  జీవుడు, బ్రహ్మ ఒకటే అనే భావన , ప్రతిఫలాసక్తి లేని నిష్కామకర్మానుష్ఠానం,  భక్తి,  వేదాంతశ్రవణాసక్తి,  ధ్యానం,  నిధిధ్యాసనం  మొదలైనవి సోపానాలుగా  ఉపయోగపడతాయి.  జ్ఞానకాండలో వేదాంత విషయాల ఆవశ్యకత చాల అవసరం . కాని కర్మకాండకు సంబంధించిన పుర్వమీమాంసాభాగంలో కూడ అద్వైతాత్మతత్త్వాన్ని బోధించే ఎన్నో వాక్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇదే ఋగ్వేద స్వరూపగా కనిపిస్తోంది.

“ఏకం సత్ విప్రా బహుధా వదంతి(2-3-22-6)  అనే మాట మనం పరిశీలిస్తే సత్పదార్థం ఒక్కటే యని దాన్ని జ్ఞానులు విష్ణువని , ఇంద్రుడని,   సూర్యుడని,   వరుణుడని, అగ్నియని,   గరుత్మంతుడని ఎన్నో విధాలుగా భావిస్తున్నారని తెలుస్తోంది .

 “ నేనే మనువును, నేనే సూర్యుడను , నేనే కక్షిమంతుడను సమస్తమునై యుంటిని (3-6-15-1)అని  వామదేవుడు ఒక చోట చెప్పడం మనం గమనిస్తాం.

 జీవుడు  తాను స్వయంగా భగవంతుడనని  తెలుసుకోలేక పోవడం వల్లనే దు:ఖానికి లోనౌతున్నాడు. ఎప్పుడైతే తాను శరీరం  కంటే, బుద్ధి కంటే,  మనసు కంటే, ఇంద్రియాలకంటే అతీతమైన పరమాత్మ స్వరూపుడనని తెలుసుకుంటాడో   అప్పుడే సంసారరూపమైన దుఃఖం నుంచి విముక్తుడౌతున్నాడు (8-1-20-1),

                            <*><*><*><*><*>

 

 

 

 

 

 

Sunday, February 26, 2023

అద్వైతసిద్ధాంతం అనగా ఏమి?

 

2.             అద్వైతసిద్ధాంతం అనగా ఏమి?

మూలం :- శ్రీ శంకరకింకరులు

అనువాదం :-చిలకమర్తి దుర్గాప్రసాదరావు  

ఈ వ్యాసం  ఉపనిషత్తులు , మహాభారతం , స్మృతులు పురాణాల యొక్క సారం కేవలం అద్వైతమే అని వివరిస్తుంది.  శ్రీ శంకరభగవత్పాదులు ఒకచోట “ఇష్యతే(దృశ్యతే) హి సర్వోపనిషదాం సర్వాత్మైక్య ప్రతిపాదకత్వం” అని స్పష్టంగా చెపుతూ  అద్వైతమే అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశంగా భావించారు . ఆయా గ్రంథాల్లో  అక్కడక్కడ  కొన్ని ద్వైతసంబంధమైన వాక్యాలు అనివార్యంగా కనిపిస్తున్నప్పటికీ   గ్రంథతాత్పర్యం మాత్రం అద్వైతప్రతిపాదనమే అని భావించాలి . శ్రీ శంకరులు , మిగిలిన ఆచార్యులు ప్రతిపాదించిన ద్వైతవాక్యాలు అద్వైతబ్రహ్మతత్త్వాన్ని తెలుసుకోడానికి సాధనాలైన  కర్మానుష్ఠానానికి, ఉపాసనకూ, చతుర్విధసాధనలకు సహాయకారులుగా భావించాలని  పేర్కొన్నారు .    అలా కాని పక్షంలో అద్వైత బోధకవాక్యాలు ద్వైత సిద్దాంతంలో పొసగవని, అవి  సమంజసం కావని భావించాలి.

అద్వైత సిద్ధాంటానికి  ప్రధానలక్షణాలు ఈ విధంగా ఉన్నాయి.

1.     బ్రహ్మమే ఆత్మ. అదే సమస్తము , సర్వవ్యాపి . ఆత్మభిన్నమైనదేదీ లేదు.

2.     ప్రపంచమంతా మిథ్య. ఇక్కడ మిధ్య అనగా యథార్థ జ్ఞానం కలిగేవరకు మాత్రమె  ఉండేది, యథార్థజ్ఞానం కలుగగానే తొలగిపోయేదని అర్థం.

3.     మోక్షం జ్ఞానం వల్లనే సిద్ధిస్తుంది.

4.     జీవుడు మరియు బ్రహ్మ ఇరువురు ఒక్కటే . ఒకరికంటే మరొకరు వేఱు కాదు.

5.     బ్రహ్మ నిర్గుణం .

6.     జీవన్ముక్తి అనగా జీవించి యుండగానే ముక్తి పొందగలడం సాధ్యం .

7.     అద్వైతసిద్ధాంతం ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక సత్యం ,  పారమార్థిక సత్యం అనే మూడు విధాలైన సత్యాన్ని అంగీకరిస్తుంది. పాము త్రాడుగా  కనిపించడం ప్రాతిభాసికసత్యం . పాము పాముగా కనిపించడం వ్యావహారిక సత్యం . పాము చైతన్యంగా దర్శనమివ్వడం పారమార్థిక సత్యం .

8.     హరిహరులకు మధ్య ఎటువంటి భేదం లేదు. ఈ సిదాంతాలు ఏ గ్రంథంలో సంపూర్ణంగా కనిపించినా అది అద్వైతగ్రంథమే.            

                               <><><><>

భగవత్పాద సిద్దాంతంలో శివ విష్ణువుల అభేదం

 

1.                  భగవత్పాద సిద్దాంతంలో శివ విష్ణువుల అభేదం

మూలం :- శ్రీ శంకరకింకరులు

అనువాదం :- చిలకమర్తి .దుర్గాప్రదసాదరావు  

శివనామని భావితేoతరంగే

మహతి జ్యోతిషి మానినీమయార్ధే

దురితాన్యపయాంతి దూరదూరే

ముహురాయాంతి మహంతి మంగళాని

స్మృతే సకలకళ్యాణభాజనం యత్ర జాయతే

పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం  

   శ్రీ శంకరభగవత్పాదులు శివుని, విష్ణువును ఒకే పరమ సర్వేశ్వరునిగా భావించారు . వారిద్దరి  మధ్య ఎటువంటి భేదాన్ని  ఆయన చూపించ లేదు. ఆయన రచించిన సూత్రభాష్యం అలాగే మిగిలిన లఘుగ్రంథాలు  పరిశీలిస్తే  ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. బ్రహ్మసూత్ర భాష్యంలోని   ప్రకృత్యధికరణంలో “ప్రకృతిశ్చప్రతిష్ఠా దృష్టాంతానుపరోధాత్” (1-4-23)   అని  శివుని  ప్రపంచానికి సమవాయకారణంగాను,    నిమిత్త కారణంగాను  వర్ణించడం గమనిస్తాం. అలాగే పాంచరాత్ర అధికరణలో నారాయణుని పరమాత్మునిగా అభివర్ణించారు . 

<><><>